A living archive of the life, cinema and vision of Nandamuri Taraka Rama Rao. Explore the archive →

← Back to the Journal

The Journal

మా ఇంటి మాటల్లోనే మొదలైన ఒక యుగం

Tulasi Padmasree1 min read2 views
మా ఇంటి మాటల్లోనే మొదలైన ఒక యుగం

ఎన్టీఆర్… ఈ పేరు ఒక వ్యక్తిని మాత్రమే సూచించదు. అది ఒక కళాఖండానికి చిరునామా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిధ్వని.

తెలుగు సినీ చరిత్ర అనే మహాగ్రంథంలో ఆయన పేరు ఒక స్వర్ణాక్షర అధ్యాయం. వెండితెరపై ధర్మానికి ప్రతిరూపంగా, ధైర్యానికి ప్రతీకగా, న్యాయానికి నిలువెత్తు ప్రతిష్ఠగా నిలిచిన ఆయన… నిజ జీవితంలో కోట్లాది సామాన్యుల ఆశలకి అక్షర రూపంగా మారారు.

రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి ఇతిహాస పాత్రల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు కేవలం నటన మాత్రమే కాదు — అవి ఒక తరం మనసుల్లో నాటుకున్న జీవిత ప్రతిమలు. ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన గంభీరత, ఆత్మీయత, ఆలోచనాత్మక లోతు… వాటిని కాలాతీతంగా నిలిపాయి. ఈనాటికీ ఆ పాత్రల్ని తలచుకుంటే ముందుగా మన కళ్ల ముందు నిలిచేది ఎన్టీఆర్ రూపమే.

కానీ ఆయన మహోన్నత వ్యక్తిత్వం వెండితెర పరిమితుల్లో ఆగిపోలేదు.

“తెలుగు వాడి ఆత్మగౌరవం” అనే నినాదం ఆయన చేతుల్లో ఒక రాజకీయ వాక్యంగా కాకుండా, ఒక సామాజిక విప్లవంగా మారింది. సాధారణ మనిషి గుండెల్లో తనకూ గౌరవం ఉంది, తనకూ హక్కు ఉంది అనే ధైర్యాన్ని నాటిన మహానాయకుడు ఎన్టీఆర్.

ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పథకాలు మాత్రమే కాదు — అవి పేదల జీవితాల్లో ఆశల దీపాలను వెలిగించిన వెలుగురేఖలు. రాజకీయాలు అంటే అధికార పీఠాల కోసం పోటీ కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే అనే భావనకు ఆయన తన జీవితం ద్వారా నిర్వచనం ఇచ్చారు.

ఈరోజు మనం సమాజ హితం కోసం, మార్పు కోసం, సేవ కోసం అడుగులు వేస్తున్నప్పుడు… ఎన్టీఆర్ చూపించిన మార్గం ఇంకా మనకు దీపపుస్తంభంలా దారి చూపుతూనే ఉంది.

ఆయన ఆశయాలకు కొనసాగింపుగా పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వంటి సంస్థలు — ఆయన ఆలోచనలు కాలాన్ని దాటినా, ఇంకా సజీవంగానే ఉన్నాయని చాటుతున్నాయి.

కొంతమంది చరిత్రలో ఒక అధ్యాయంగా మిగులుతారు.
కానీ ఎన్టీఆర్ వంటి మహావ్యక్తులు, వారి జీవితాన్నే ఒక చరిత్రగా మలిచిపోతారు.

Nandamuri Taraka Rama Rao

A Legacy That Lives Forever