A living archive of the life, cinema and vision of Nandamuri Taraka Rama Rao. Explore the archive →

← Back to the Journal

The Journal

వైద్య, విద్యా రంగాల దార్శనికుడు ఎన్ఠీఆర్!

Neerukonda Prasad2 min read
వైద్య, విద్యా రంగాల దార్శనికుడు ఎన్ఠీఆర్!

తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, రాజకీయ యవనికపై అజేయ శక్తిగా వెలిగిన ఎన్టీఆర్, కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాలేదు. పేద విద్యార్థుల భవిష్యత్తును మార్చే బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు నేటికీ విద్యా వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఎన్ఠీఆర్ తెచ్చిన విద్యా సంస్కరణల వల్ల విద్య, వైద్యం అనేవి సామాన్యుడి గడప వరకు చేరాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు కేవలం చట్టాలు మాత్రమే కాదు, లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో నేడు వెలుగులు నింపుతున్నాయి. ఉన్నత విద్య, వైద్య విద్య వంటి రంగాలు ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైపోయాయి.డబ్బున్నవారే డాక్టర్‌, ఇంజనీర్‌ అవ్వడం సులభమయింది. ప్రతిభ ఉన్నా పేద విద్యార్థికి విద్య ఒక అందని ద్రాక్షగా మారింది. అలాంటి అసమాన పరిస్థితులను ఛేదిస్తూ, విద్యను హక్కుగా మార్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. అప్పట్లో ప్రైవేట్ ఉన్నత విద్యాకళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. లక్షల రూపాయలు చెల్లించ గలిగినవారికే సీట్లు లభించేవి.పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు విలువ లేకుండా పోయింది. మేధస్సు ఉండి, డబ్బు లేని పేద విద్యార్థులకు అన్యాయం జరగ కూడదని ఎన్టీఆర్ క్యాపిటేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేశారు.దీనివల్ల విద్య అనేది అమ్మకపు వస్తువు కాకుండా, అర్హత కలిగిన ప్రతి బిడ్డకు దక్కే హక్కుగా మారింది.డబ్బుతో సీట్లు కొనుక్కునే పద్ధతికి స్వస్తి పలికి, కేవలం ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ప్రవేశం జరగాలని ఎన్టీఆర్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టారు దాంతో ప్రతిభ ఆధారంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభించాయి.గ్రామీణ మరియు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది.విద్యపై ఉన్న వర్గాధిపత్యం చెదిరిపోయింది.సామాజిక న్యాయం విద్యా వ్యవస్థలో ప్రతిఫలించింది.గ్రామీణ పేద విద్యార్థి అయినా, నగరంలోని సంపన్న విద్యార్థి అయినా ఒకే పరీక్ష రాసి, తమ ప్రతిభతో డాక్టర్ లేదా ఇంజనీర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు.ఈ విధానం వల్ల మధ్యతరగతి, అట్టడుగు వర్గాల నుండి వేలాది మంది నేడు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప వైద్యులుగా, ఇంజనీర్లుగా రాణిస్తున్నారు.


1987లో వైద్య విధాన పరిషత్
వైద్య సేవలు నగరాలకు మాత్రమే పరిమితమైన కాలంలో గ్రామీణ ప్రజలు సరైన వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 1987లో ఎన్‌టీఆర్ ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ను స్థాపించింది.వైద్య విధాన పరిషత్ ఏర్పాటుతో ద్వితీయ స్థాయి ఆసుపత్రులు బలపడాయి .జిల్లా మరియు తాలూకా స్థాయి ఆసుపత్రులను స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా మార్చి, నిధుల కొరత లేకుండా ఆధునిక పరికరాలు, మందులు అందుబాటులో ఉంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ద్వితీయ శ్రేణి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది.వైద్య సేవలను ప్రజలకు దగ్గర చేసారు.ఎన్‌టీఆర్ తీసుకున్న ఈ రెండు సంస్కరణలు -విద్యలో క్యాపిటేషన్ ఫీజు రద్దు మరియు,వైద్య విధాన పరిషత్ స్థాపన సాధారణ పరిపాలనా నిర్ణయాలు కాదు. ఇవి సమాజంలో అవకాశాల సమానత్వాన్ని నెలకొల్పిన విప్లవాత్మక చర్యలు.పేదవాడి ఇంటి నుంచి డాక్టర్‌, ఇంజనీర్‌, ప్రొఫెసర్‌లు వెలువడే మార్గాన్ని ఆయన నిర్మించారు. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత అన్న భావనను బలంగా నిరూపించారు. ఎన్‌టీఆర్ అధికారాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా ఉపయోగించారు. విద్య ధనికుల హక్కు కాదు, ప్రతి ప్రతిభావంతుడి హక్కు అని ఆయన ఆచరణలో చూపించారు.అట్లాగే దేశంలోనే మొదటిసారిగా వైద్య విద్య కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని భావించి, 1986లో విజయవాడలో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ప్రస్తుతం అది డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పిలవబడుతోంది. వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి ఇది ఒక మైలురాయి అని చెప్పాలి. ఆనాడు ఎన్ఠీఆర్ చేపట్టిన విద్యా సంస్కరణలు నేటికీ విద్యా వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలవడం గర్వ కారణం.


Nandamuri Taraka Rama Rao

A Legacy That Lives Forever