A living archive of the life, cinema and vision of Nandamuri Taraka Rama Rao. Explore the archive →

← Back to the Journal

The Journal

తెలుగు జాతి ఆత్మగౌరవ సంతకం – మన ‘అన్నగారు’

Jaladi Vijaya2 min read
తెలుగు జాతి ఆత్మగౌరవ సంతకం – మన ‘అన్నగారు’

“చరిత్రను చదివేవాడు విద్యార్థి అవుతాడు.. చరిత్రను సృష్టించేవాడు నాయకుడు అవుతాడు.. కానీ ఆ చరిత్రే తనని వెతుక్కుంటూ వచ్చేలా చేసుకున్నవాడు ‘ఎన్టీఆర్’ అవుతాడు!”

తెలుగు వాడు ఎక్కడున్నా, తలెత్తుకు తిరిగేలా చేసిన ఒకే ఒక్క పేరు.. నందమూరి తారక రామారావు. ఆయన కేవలం ఒక నటుడు కాదు, ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఆయన ఒక శకం, ఒక ప్రభంజనం, ఒక భావోద్వేగం!

1. వెండితెర వేల్పు – కఠోర శ్రమకు నిలువుటద్దం

నిమ్మకూరు అనే చిన్న పల్లెటూరిలో పుట్టిన ఒక సామాన్యుడు, ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి’గా ఎలా ఎదిగాడు? దాని వెనుక ఉన్నది అదృష్టం కాదు, ఎముకలు కరిగే కష్టం!

ఆయన క్రమశిక్షణ ఒక పాఠం. తెల్లవారుజామున 3 గంటలకు లేచి, మేకప్ వేసుకుని, డైలాగులు బట్టీ పట్టి, పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. శ్రీకృష్ణుడంటే ఎలా ఉంటాడు? రాముడంటే ఎలా నడుస్తాడు? దుర్యోధనుడి ఠీవి ఎలా ఉంటుంది? మనకు తెలియదు.. కానీ ఎన్టీఆర్ గారిని చూస్తే “ఓహో.. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో” అనిపించేంతలా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. బౌన్సర్లు లేని రోజుల్లో, కేవలం తన చూపుతోనే జనాలను కట్టిపడేసిన సమ్మోహన శక్తి ఆయనది.

“ఆరడుగుల ఆజానుబాహుడు.. అభినయానికి ఆద్యుడు

కనుబొమ్మల కదలికతో నవరసాలు పలికించిన నాట్యరుషి..

తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీ పీఠం వరకు వినిపించిన సింహం..

ఆయన నటన ఒక నిఘంటువు.. ఆయన జీవితం ఒక గెలుపు రుజువు!”

2. చైతన్య రథం – ఒక ప్రజా ప్రస్థానం

అరవై ఏళ్లు దాటాయి.. కావాలంటే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అని చెప్పి, ఖాకీ చొక్కా తొడిగి, ఒక పాత వ్యాను (చైతన్య రథం) ఎక్కి రోడ్ల మీదకు వచ్చారు.

“కదలిరండిరా తెలుగు బిడ్డలారా.. మన అన్నవచ్చె చూడరా..

ఆ ఢిల్లీ కోటను గడగడలాడించే.. సింహం కదిలే చూడరా!!

ఆగదు ఈ రథము.. సాగనీ ఈ పథము..

పేదోడికి పట్టెడన్నం పెట్టేదాక ఆగదంట ఈ రథము!!”

“కూడు గూడు లేనోడికి.. అండగా నిలిచాడు

రెండు రూపాయలకే కిలో బియ్యం.. పేదోడికి పంచాడు!

దొరల గడీలను బద్దలు కొట్టి.. దండోరా వేసాడు

పటేలు పట్వారీ వ్యవస్థను.. రద్దు చేసాడు!

ఆడబిడ్డలకు ఆస్తిలోన.. వాటా ఇచ్చినాడు

ఆత్మగౌరవమంటూ.. జెండా ఎత్తినాడు!

అన్నగారంటే మాకు.. ప్రాణం అన్నాడు..

మన తెలుగు జాతికి ఆయనే.. దైవం అయ్యాడు!!”

3. రాజకీయ రణక్షేత్రం – సంక్షేమ రారాజు

ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అది ఒక అద్భుతం. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం! అది ఎన్టీఆర్ అనే సునామీకి మాత్రమే సాధ్యం. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సంతకం సామాన్యుడి తలరాతను మార్చింది.

పేదవాడి ఆకలి తీర్చాడు: రెండు రూపాయలకే కిలో బియ్యం పథకంతో ఎంతో మంది పేదల కడుపు నింపిన అన్నపూర్ణ ఆయనే.

మహిళా పక్షపాతి: ఆస్తిలో ఆడవారికి సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనదే.

పాలన సంస్కరణలు: మండలాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజల గుమ్మం ముందుకు తెచ్చారు.

అధికారం కోసం కాకుండా, ఆశయం కోసం పనిచేశారు కాబట్టే.. మరణం లేని మహానాయకుడిగా మిగిలిపోయారు.

ముగింపు: తెలుగు గుండెల్లో శాశ్వత చిరునామా

కాలం మారుతుంది, తరాలు మారుతాయి. కానీ “తెలుగు వాడు” అని చెప్పుకునే ప్రతిసారీ ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తూనే ఉంటారు. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి. ఒక చరిత్ర. ఒక జ్ఞాపకం.

జోహార్ ఎన్టీఆర్! జై తెలుగు జాతి!

Nandamuri Taraka Rama Rao

A Legacy That Lives Forever